by Pakka Real Estate -- September 25, 2024 in Real Estate News
తెలంగాణలో ఎక్కడ చూసినా హైడ్రా చేస్తున్న హై డ్రామాకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని నగరంలో చెరువులు, ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలను అక్రమంగా ఆక్రమించుకొని ఇల్లు, ఫంక్షన్ హాల్స్ లాంటి పలు కట్టడాలను నిర్మించిన వారికి హడలు పుట్టించేలా హైడ్రా ముందుకు సాగుతోంది. ఇది హర్షించదగిన విషయమే అయినప్పటికీ ఇందులో కొందరు బడుగు బలహీనవర్గాలు నలిగిపోతున్నారు. మరి ముఖ్యంగా శని, ఆదివారాలలో జరిగిన హైడ్రా కూల్చివేతలలో ఎందరో పేదలు నిరాశ్రయులయ్యారు.
దీంతో స్పందించిన బిజెపి నేతలు.. హైడ్రా దూకుడు కి అడ్డుకట్ట వేయడానికి ఒకటి అవుతున్నారు. మొదట్లో హైడ్రా పై బిజెపిలో భిన్నాభిప్రాయాలు కనిపించాయి.. దీంతో కాస్త గందరగోళం నెలకొంది. అయితే ఇప్పుడు హైడ్రా పెద్దలకు ఒక న్యాయం.. పేదలకు మరొక న్యాయం అవలంబిస్తోంది అని భావించిన కమలనాధులు రోడ్డు ఎక్కడానికి కూడా సిద్ధపడిపోయారు. ముఖ్యంగా తొలుత హైడ్రాకు తన పూర్తి మద్దతును అందించిన బిజెపి ఎంపీ రఘునందన రావు కూడా ఇప్పుడు హైడ్రా పనితీరుపై విమర్శలు కురిపిస్తున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేంద్ర వంటి వారు మొదటినుంచి హైడ్రా పేరిట అరాచకం జరుగుతోందని విమర్శిస్తూనే ఉన్నారు.
ఇదే విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి బిజెపి సీనియర్ నేతలు సంసిద్ధమవుతున్నారు. హైడ్రా కూల్చివేతల కారణంగా భారీ నష్టానికి గురి అయిన బాధితులను కలిసి వారిని ఓదారుస్తున్నారు. హైడ్రా కారణంగా అప్పులు చేసి ఇల్లు కట్టుకుంటున్న పేద, మధ్యతరగతి కుటుంబీకులు రోడ్డున పడుతున్నారని.. కనీసం వారి గోడు కూడా పట్టించుకునే వారు లేరని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే హైడ్రా కూల్చివేతలపై కేంద్రానికి ఫిర్యాదు కూడా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పై పోరాటానికి కమలనాధులకు హైడ్రా ప్రస్తుతం హై ఎండ్ వెపన్లా తయారైంది. ఇదే ప్రధాన ఆయుధంగా కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టి ప్రజలలో తిరిగి తమ పాపులారిటీ పెంచుకోవడానికి బిజెపి నేతలు సంసిద్ధులు అవుతున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా ద్వారా రాజకీయంగా ఎంతో ప్రయోజనం దక్కుతుంది అని ఆశిస్తున్న కాంగ్రెస్.. ఈ పోరాటాన్ని ఎలా తిప్పి కొడుతుందో చూడాలి.