by Pakka Real Estate -- September 02, 2025 in Real Estate News
కుప్పకూలిన రియల్ ఎస్టేట్.. మధ్యతరగతి వారికి వరమా ?
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం భవిష్యత్తుపై ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతూ వస్తోంది. ఒకవైపు అమ్మకాలు మందగించాయని, మార్కెట్ పడిపోతోందని ఆందోళనలు వ్యక్తమవుతుండగా, మరోవైపు విలాసవంతమైన గృహాల అమ్మకాలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయని టాక్ నడుస్తోంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ నిపుణుడు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో "హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుప్పకూలుతోందా?" అనే అంశంపై చర్చించడంతో ఈ గందరగోళం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో, వాస్తవ గణాంకాలు, నిపుణుల అభిప్రాయాల ఆధారంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ వాస్తవ పరిస్థితిని ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మందగమనంలో అమ్మకాలు.. ఇందులో నిజం ఎంత ?
2025 సంవత్సరం ప్రథమార్థంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొన్న సంగతి అందరికీ తెలిసిందే.. రియల్ ఎస్టేట్ సేవల సంస్థల నివేదికల ప్రకారం.. 2025 జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో నివాస గృహాల అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 47% తగ్గిన సంగతి మనందరికీ తెలుసు.. ఇది దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోకెల్లా అత్యధిక క్షీణత... ఇదే సమయంలో కొత్త ప్రాజెక్టుల ప్రారంభం కూడా 55% వరకు పడిపోయాయని వార్తల్లో చూసాం.. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కూడా అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 6% తక్కువగా నమోదయ్యాయి.
ఈ మందగమనానికి పలు కారణాలున్నాయి. అమెరికాలో నెలకొన్న ఆర్థిక సంక్షోభాల కారణంగా ఎన్నారై (NRI)ల నుంచి పెట్టుబడులు తగ్గడంతో పాటు.. స్థానిక కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు అధిక ధరల కారణంగా వెనకడుగు వేయడం వంటివి ప్రధాన కారణాలుగా డెవలపర్లు పేర్కొంటున్నారు.
విలాసవంతమైన గృహాల మార్కెట్ జోరు...
మార్కెట్ మందగించిందనే వాదనలకు భిన్నంగా.. ప్రీమియం, లగ్జరీ హౌసింగ్ విభాగం మాత్రం అత్యంత బలంగా ఉంది. రూ. 1.5 కోట్లు, అంతకంటే ఎక్కువ విలువైన ఇళ్ల అమ్మకాలు 2025 మొదటి అర్ధభాగంలో 17 శాతం పెరిగాయి . ఆశ్చర్యకరంగా, మొత్తం అమ్మకాల విలువలో రూ. 3 కోట్లకు పైబడిన ఇళ్ల వాటా 35 శాతంగా ఉంది . ఇది నగరంలో పెరుగుతున్న సంపన్న వర్గం, వారి కొనుగోలు శక్తికి నిదర్శనంగా భావించవచ్చు.
రాజపుష్ప ప్రొవిన్సియా, మై హోమ్ రాక, అపర్ణ జెనాన్ వంటి ప్రీమియం ప్రాజెక్టులు అమ్మకాలలో అగ్రస్థానంలో నిలిచాయి.. నగరం యొక్క సగటు ఆస్తి విలువ కేవలం ఒక సంవత్సరంలో రూ. 20 లక్షలు పెరిగి, రూ. 1.84 కోట్లకు చేరుకుంది. దీంతో హైదరాబాద్ దేశంలోనే రెండవ అత్యంత ఖరీదైన హౌసింగ్ మార్కెట్‌గా అవతరించింది.
మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ ప్రోత్సాహం..
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధికి మౌలిక సదుపాయాల అభివృద్ధి కీలక శక్తిగా పనిచేస్తోంది . మెట్రో రైలు రెండవ దశ, రీజినల్ రింగ్ రోడ్ (RRR), ఔటర్ రింగ్ రోడ్‌ను కలుపుతూ.. కొత్త గ్రీన్ ఫీల్డ్ రోడ్ల నిర్మాణం వంటి ప్రాజెక్టులు శివారు ప్రాంతాల రూపురేఖలను మారుస్తున్నాయి.. దీనికి తోడు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) కొత్త లేఅవుట్‌లకు, బహుళ అంతస్తుల భవనాలకు వేగంగా అనుమతులు మంజూరు చేస్తోంది . కోకాపేట, బుద్వేల్, మోకిల వంటి ప్రాంతాల్లో HMDA నిర్వహించిన ప్లాట్ల వేలానికి అనూహ్యమైన స్పందన రావడం డిమాండ్‌కు అద్దం పడుతోంది.
నిపుణుల హెచ్చరిక.. రెండుగా చీలిన మార్కెట్..
కొందరు రియల్ ఎస్టేట్ నిపుణులు ఈ సంక్లిష్ట పరిస్థితిపై పెట్టుబడిదారులను హెచ్చరిస్తున్నారు. వారి విశ్లేషణ ప్రకారం, హైదరాబాద్ మార్కెట్ ఒకేలా లేదు.. అది రెండుగా విడిపోయిందని. ఒకవైపు లగ్జరీ మార్కెట్ పరుగులు పెడుతుంటే, మరోవైపు సామాన్యులకు అందుబాటులో ఉండే గృహాల (రూ. 70 లక్షల లోపు) విభాగం పూర్తిగా కనుమరుగైంది. ఇది మొత్తం అమ్మకాల విలువలో కేవలం 3 శాతం వాటాను మాత్రమే కలిగి ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు గుడ్డిగా నిర్ణయాలు తీసుకోవద్దని, ముఖ్యంగా ఫార్మ్ ల్యాండ్, అసంఘటిత వెంచర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రత్యేక కధనం : Pakka Real Estate