by Pakka Real Estate -- July 27, 2024 in Real Estate News
హైదరాబాద్ అంటేనే రియల్ ఎస్టేట్ కి అడ్డ.. నగరంలోని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కాగా రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోయింది. 2017 సంవత్సరం నుంచి అంచలంచెలుగా ఎదిగిన రియల్ ఎస్టేట్ 2024వ సంవత్సరం వచ్చేసరికి పాతాళానికి పడిపోయిందంటే నమ్మశక్యంగా లేదు కదా? ఒకపక్క తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, మరోపక్క ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ గెలవడం కారణంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. గత కొన్ని సంవత్సరాల తర్వాత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి కావడం వల్ల ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ సహాయంతో పారిశ్రామిక రంగాన్ని పునరుద్దిస్తున్నారు. దీని కారణంగా అక్కడ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది. తెలంగాణలోని రియాల్టర్లు ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువగా ముగ్గు చూపుతున్నారు. దీని కారణంగా కూడా హైదరాబాదులోని రియల్ ఎస్టేట్ దెబ్బతినిందని నిపుణులు చెబుతున్నారు.
2019 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని జగన్ సర్కార్ అధికారంలోకి రావడం వల్ల అప్పుడు రియల్ ఎస్టేట్ రంగం వెనకబడిపోవడం.. జగన్మోహన్ రెడ్డి దెబ్బకు బిల్డర్లంతా హైదరాబాదులో వచ్చి భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. దీంతో పాటు కొంతమంది బడా ఇన్వెస్టర్లు కూడా భాగ్యనగరానికి వచ్చి పెట్టుబడులు పెట్టారు. దీంతో ఆంధ్రాలో ఉన్న సామాన్య జనాలు కూడా 2020 సంవత్సరంలో హైదరాబాదులోని ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపారట. ఇక 2022 సంవత్సరం వరకు తెలంగాణలోని రియల్ ఎస్టేట్ రంగానికి ఎలాంటి లోటు లేకుండా పోయింది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద పెద్ద కంపెనీలు రావడంతో నగర శివారులో కూడా ఓపెన్ ఫ్లాట్స్ కి డిమాండ్ భారీగా పెరిగింది.
ఇదిలా ఉంటే 2022 సంవత్సరంలో కెసిఆర్ సర్కార్ రియల్ ఎస్టేట్ రంగానికి వస్తున్న లాభాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టేసింది. ఇది కాస్త రివర్స్ అయింది.. దీని కారణంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుదేలైంది. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్ భూములను ఓఆర్ఆర్ పక్కన 100 కోట్లకి అమ్మకాలు జరిపారు. అయితే ఈ ఐడియాని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని కాస్త దెబ్బ తినేలా చేసింది. ఇదే సంవత్సరంలో హైదరాబాద్ నగరంలోని రెండు లక్షలకు పైగా అపార్ట్మెంట్ల నిర్మాణం పూర్తికాగా.. ఎలాంటి సేల్స్ లేకుండా ఖాళీగా పడి ఉన్నాయి. అధికారులు కోట్ల రూపాయలు లంచాలు తీసుకొని ఎకరం స్థలంలో కూడా 50 ఫ్లోర్లకు పైగా అపార్ట్మెంట్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చి నగరాన్ని నిండా ముంచేశారు. అంతేకాకుండా కొన్ని పెద్ద పెద్ద కంపెనీల చేత ఎకరాలకు ఎకరాలు కొన్ని వందల కోట్లతో కొనిపించి ఎత్తైన మేడలను కట్టించింది కేసీఆర్ సర్కార్.. దీని కారణంగా అందులో జీవించే లక్షలాదిమంది ఒకేసారి కార్లతో బయటికి రావడంతో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడేది. దీని కారణంగా కూడా కాస్త రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతినిందని నిపుణులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఎన్నికలకు ముందు రియల్ ఎస్టేట్ రంగం కాస్త కుదేలైనప్పటికీ.. ఎన్నికల అయిన తర్వాత పుంజుకుంటూ ఉంటుంది. అయితే తెలంగాణలో మాత్రం ఎన్నికల చాలా నెలలు కావస్తున్న ఏమాత్రం సర్దుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతేకాకుండా రోజురోజుకు గుదేలవుతూ రావడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉందని నిపుణులు తెలుపుతున్నారు. దీనికి ప్రధాన కారణమేమిటంటే కేసీఆర్ సర్కారు సమయంలో జరిగిన పరిమితికి మించిన అపార్ట్మెంట్ల నిర్మాణాలేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికీ హైదరాబాద్ సిటీలోని రెండు లక్షలకు పైగా అపార్ట్మెంట్లు ఎలాంటి సేల్స్ లేకుండా ఖాళీగా ఉన్నాయంటున్నారు. అంతేకాకుండా బిల్డింగ్లను కొనే వారు లేకుండా కూడా కొన్ని కంపెనీలు బ్యాంకుల్లో కోట్ల కొద్ది అప్పులు చేస్తూ అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు అయితే ఎన్నారైల సహాయంతో డబ్బులు అప్పుగా తెచ్చుకొని రియల్ ఎస్టేట్లో పెట్టుబడులుగా పెడుతున్నారు.
ప్రస్తుతం చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు డిమాండ్ లేకపోయినా కొత్త వెంచర్ల తో పాటు అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు. లక్షల కోట్లు అప్పులు చేసి వీటిని నిర్మించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు పెట్టిన పెట్టుబడులు మూడు సంవత్సరాల తర్వాత రెట్టింపు అవుతాయని అనుకుంటున్నారు. అంతేకాకుండా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు 2027 సంవత్సరంలో తప్పకుండా రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతుందని అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నారు. కానీ కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు మాత్రం ఎలాంటి కొత్త వెంచర్ల జోలికి పోకుండా ఉన్న వాటినే సేల్ చేసుకునే దారిలో పడ్డాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రియల్ ఎస్టేట్ కు సంబంధించిన ఏదైనా ప్రకటన వస్తే తప్ప ఈ రంగం మెరుగుపడే అవకాశాలు లేవని నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా 2027 సంవత్సరం వరకైనా రియల్ ఎస్టేట్ రంగం మెరుగుపడుతుందో లేదో? వేచి చూడాల్సిందే.!