by Pakka Real Estate -- September 22, 2024 in Real Estate News
Hydra effect on real estates in Hyderabad : గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ ప్రజలను హైడ్రా బెంబేలెత్తిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ హైడ్రా కాన్సెప్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కొత్త కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. అంతేకాకుండా ఈ హైడ్రాను ఓ పద్ధతిలో నడిపించేందుకు ప్రత్యేకమైన ఐపీఎస్ అధికారిని కమిషనర్ గా నియమించి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. దీంతోపాటు హైడ్రాకు ఎక్కడ ఎలాంటి అడ్డంకులు రాకుండా స్పెషల్ పవర్స్తో ప్రత్యేకమైన పోలీస్ సిబ్బందిని కూడా నియమించారు. దీంతో ఇదే క్రమంలో హైడ్రా ఏమాత్రం వెనకాడకుండా ప్రభుత్వ స్థలాల్లో కట్టిన కట్టడాలు చెరువులను ఆక్రమించి కట్టిన పెద్ద పెద్ద భవనాలను సైతం కూల్చేస్తూ వస్తోంది.
ఇదిలా ఉంటే గతంలో చెరువులు నాళాలపై ఆక్రమించి కట్టిన కట్టడాలు, బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన పెద్దపెద్ద బిల్డింగులు, పరిశ్రమలను సైతం హైడ్రా ఏ మాత్రం వదలకుండా కూల్చివేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ హైదరాబాద్ మహానగరంలోని 160 కి పైగా అక్రమ నిర్మాణాలను కూల్చేసినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. అలాగే ఈ హైడ్రా ఎంతో పలుకుబడి ఉన్న నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను వదలకుండా మరీ కూల్చిందంటే భవిష్యత్తులో ఎలాంటి అక్రమ కట్టడాలైన కూల్చడానికి రెడీ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో హైడ్రా హైదరాబాద్ మట్టికే ఉన్నప్పటికీ ఇప్పుడు దేశమంతా దీని పేరు వినిపిస్తుంది.
ఇదిలా ఉంచితే.. ఈ హైడ్రా దెబ్బకు మాత్రం రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రదేశాలలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పడిపోయినట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్లు జరగక రియల్ ఎస్టేట్ వ్యాపారులు దివాలా తీసినట్లు సమాచారం. అంతేకాకుండా ఇటీవల హైదరాబాద్కు సంబంధించిన రియల్ ఎస్టేట్ గణాంకాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి కూడా తెలిసిందే. ఇటీవలే ప్రాప్‌ఈక్విటీ డాటా అనలిటిక్ సంస్థ విడుదల చేసిన ఓ రిపోర్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వారికి కంటతడి పెట్టిస్తోంది. భారతదేశంలోని తొమ్మిది ప్రధాన నగరాలకు సంబంధించిన ఇండ్ల అమ్మకాలపై ఈ సంస్థ రిపోర్టును విడుదల చేసింది.
ప్రాప్‌ఈక్విటీ డాటా వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరం ఈ రిపోర్ట్ లో భాగంగా 42% క్షీణతతో నిలిచింది. ఇందులో ముంబాయి 17%, థానె 10 శాతం, చెన్నై 18%, కోల్కత్తా 23%, బెంగళూరు 26%గా ఉన్నట్లు రిపోర్టు తెలిపింది. మొత్తం తొమ్మిది నగరాల్లో రిపోర్ట్ల ఆధారంగా ఇండ్ల విక్రయాలు 1,04,393 యూనిట్లుగా పేర్కొంది. గత ఏడాది ఈ యూనిట్లు 1,26,848 ఉన్నట్లుగా సంస్థ వెల్లడించింది. ఈ లెక్కల ప్రకారం చూస్తే 18% డౌన్ ఫాల్ అయినట్లు తెలుస్తోంది. ఇక కేవలం హైదరాబాద్ విషయానికొస్తే.. 20,658 యూనిట్లుగా ఉన్న ఇండ్ల అమ్మకాలు.. జులై సెప్టెంబర్ త్రైమాసికంలో 12,082 యూనిట్లుగా ఉండొచ్చని సంస్థ తెలిపింది. తాజా సర్వే ప్రకారం అన్ని నగరాల కంటే హైదరాబాద్ నగరం అత్యధికంగా రియల్ ఎస్టేట్ పడిపోయినట్లు తెలుస్తోంది.