by Pakka Real Estate -- April 08, 2026 in Real Estate News
REAL ESTATE LATEST NEWS : అమాయక ప్రజలకు స్వర్గం లాంటి నివాసాన్ని అందిస్తామని, మీ ఇంట సిరులు కురిపిస్తామని నమ్మబలికి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న స్వర్గసీమ రియల్ ఎస్టేట్ సంస్థ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆకర్షణీయమైన ప్రకటనలు, ఆస్కార్ స్థాయి నటనతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్న ఈ సంస్థ అధినేత చంద్రశేఖర్ అక్రమ సామ్రాజ్యంపై ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
రంగారెడ్డి జిల్లా కొందురుగు మండలం చెరుకుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే భారీ వెంచర్ వెలిసింది. వ్యవసాయ భూమిని నివాస స్థలాలుగా మార్చడానికి అవసరమైన నాలా (NALA) కన్వర్షన్ లేకుండానే అక్రమ లేఅవుట్లు వేసి ప్లాట్లుగా విడగొట్టి అమ్ముతున్నట్లు విచారణలో తేలింది. చట్టప్రకారం వ్యవసాయ భూమిని నేరుగా ప్లాట్లుగా అమ్మడం నేరం అయినప్పటికీ, చంద్రశేఖర్ యథేచ్ఛగా ఈ దందా సాగిస్తున్నారు.
ఈ అక్రమ వెంచర్ వెనుక కొందరు అధికారుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా చెరుకుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఈ అక్రమాలను అడ్డుకోవడంలో విఫలమయ్యారని, ఆయన మౌనం వెనుక భారీగా ముడుపులు అందినట్లు విమర్శలు వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా డిపిఓ ఆదేశాలతో జరిగిన విచారణలో అక్రమాలు జరిగినట్లు డిఎల్పిఓ, ఎంపిఓ నిర్ధారించారు.. నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారే తప్ప.. నిర్మాణాలను అడ్డుకోవడంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
చంద్రశేఖర్ తన వెంచర్లకు సంబంధించిన ప్రకటనలు టీవీ ఛానళ్లు, సోషల్ మీడియా, భారీ హోర్డింగ్‌ల ద్వారా విపరీతమైన ప్రచారం కల్పిస్తున్నారు. తానే స్వయంగా ప్రకటనల్లో నటిస్తూ, తాపి మేస్త్రీగా, దోశలు వేసే సామాన్యుడిగా కనిపిస్తూ ప్రజల సానుభూతిని, నమ్మకాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఈ ముసుగులో జరుగుతున్నది భారీ దోపిడీ అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్వర్గసీమ, సిరుల సీమ, సుకేతన వంటి ఆకర్షణీయమైన పేర్లతో గాలం వేస్తున్న ఇలాంటి వెంచర్లలో పెట్టుబడి పెట్టే ముందు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, నాలా కన్వర్షన్, డీటీసీపీ, హెచ్‌ఎండీఏ అనుమతులు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని సూచిస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న ఇలాంటి సంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
రియల్ ఎస్టేట్ రంగంలో తాజా వార్తల కోసం & మీ ప్రాజెక్ట్ ల యాడ్స్ ఇవ్వాలనుకుంటే